నూతన సహకార వ్యవస్థ నిర్మాణంలో ‘మల్ఖా కామన్స్’ పాత్ర కీలకం!
చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న భారతదేశ గ్రామీణ ప్రజలకు మెరుగైన జీవనోపాధి, చేనేత వృత్తిపరమైన సంప్రదాయ పద్ధతులను పరిరక్షించడం, పర్యావరణ హిత సమాజ నిర్మాణంలో తమ పాత్ర పోషించడం లాంటివి ‘మల్ఖా కామన్స్’ (దేశీ విత్తనాల నుండి పత్తిని తయారు చేయడం, పత్తి నుండి చివరి వస్త్ర ఉత్పత్తి వరకు ఎటువంటి కాలుష్య కారకాలు లేకుండా ఒకే ప్రదేశంలో చేయడం) ముఖ్య వుద్దేశం. దేశీ విత్తనాలతో సహజసిద్ధమైన వ్యవసాయం చేయడం, వడకడం ప్రక్రియ ద్వారా నూలు దారాలను తయారుచేయడం, సహజ వర్ణాలతో నూలుకు రంగులను అద్దడం, నూలు దారాలను పడుగు - పేకగా ఒకదానితో ఒకటి అల్లడం ద్వారా చేనేత వస్త్ర ఉత్పత్తులను తయారుచేయడం, తయారయిన వస్త్ర ఉత్పత్తులను విక్రయించడం వంటి ప్రక్రియలన్నింటినీ ఒకే వేదిక క్రిందకి తీసుకొని రావడం అంటే.. వివిధ రంగాలను కలుపుతూ ఒక నూతన సహకార వ్యవస్థను నిర్మించడంలో ‘మల్ఖా కామన్స్’ కీలకపాత్ర పోషించబోతునట్లు అర్థమవుతుంది. చేనేత వస్త్ర ఉత్పత్తి ప్రక్రియలో మొదటి దశ నుండి చివరి దశ వరకు జరిగే ప్రక్రియలన్నింటినీ ఒక వేదిక పైకి తీసుకురావడం ద్వారా ఒక బలమైన చేనేత సహకార వ్యవస్థలో భాగస్వామ్యం కావాలనుకునే భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవబోతున్నట్లు అర్థమవుతుంది.

‘మల్ఖా కామన్స్’ ఒక ప్రయోగశాల మాత్రమే కాదు, ఒక భావనాత్మక ప్రదేశం. విభిన్న రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులు తమ నైపుణ్యాలతో ఒకరికొకరు పరస్పర అవగాహనతో ప్రత్యేక లక్షణాలతో కూడిన ప్రదేశమే ‘మల్ఖా కామన్స్’. వ్యవసాయ రంగంలో ఎంతో జ్ఞానం కలిగిన రైతులు సేంద్రియ పద్ధతులలో దేశీ విత్తనాలతో పత్తి పంటను పండించడంతో పాటుగా సరైన దిగుబడి సాధించడంలో ఎంతో నైపుణ్యతను కలిగి వున్నారు. ఇలా రైతుల నుండి సేకరించిన ముడిపత్తిని నాణ్యమైన దారాలుగా తయారుచేయడంలో స్పిన్నర్ల నైపుణ్యత, ఆ దారాల నుండి చేనేత వస్త్రాన్ని తయారుచేయడంలో చేనేత కార్మికుల నైపుణ్యత వర్ణించలేనివి. ఇటువంటి విభిన్న లక్షణాలను కలిగిన ఆలోచనాపరులు ఒక వేదికలో వుండడం చాలా గర్వకారణం. ఇటువంటి ఒక గొప్ప వేదికను ‘మల్ఖా కామన్స్’ ఏర్పాటు చేయడం, ముఖ్యంగా వినూత్నమైన చేనేత వస్త్రాలను తయారుచేసే వారికి ఆదర్శవంతంగా నిలుస్తుందని గర్వంగా చెప్పవచ్చు. ఒకపక్క పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నష్టాల పాలవుతున్న పత్తి రైతులు, మరోపక్క నూలు ధరలు విపరీతంగా పెరగడం వల్ల చేనేత కార్మికులకు నాణ్యమైన చిలపల నూలు అందుబాటులో లేకపోవడంతో రోజువారీ పని కోల్పోతున్న పత్తి రైతులు, చేనేత కార్మికులు ఆర్థిక సమస్యలతో, అర్ధాకలితో జరుగుతున్న ఆత్మహత్యల గురించి ప్రతిరోజు మనం వింటూనే వున్నాము. ఇటువంటి సమస్యలను అధిగమించి, వ్యవసాయ రంగంలోని పత్తి రైతులకు, అటు చేనేత కార్మికులకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడం ద్వారా పరస్పర అవగాహనతో నాణ్యమైన, అందమైన చేనేత వస్త్రాలను తయారుచేసే ప్రక్రియలో చేనేత కార్మికులకు కావలసిన నాణ్యమైన చిలపల నూలుకు అవసరమైన పత్తిని రైతులు నేరుగా అందించడం ద్వారా వారికి జీవనభద్రతను కల్పించడంలో ఒక వేదికగా ‘మల్ఖా కామన్స్’ నిలుస్తుందని అర్థం చేసుకోవచ్చు.
‘మల్ఖా కామన్స్’లో స్పిన్నింగ్ ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పత్తి రైతులు పండించే ముడిపత్తిని ఉపయోగించి చేనేత కార్మికుల ప్రాణాధారమైన చిలపల నూలును తయారుచేయడం, చిలపల నూలును ఉపయోగించి తయారుచేసిన చేనేత వస్త్ర ఉత్పత్తి నాణ్యత, ఆకృతి, సంప్రదాయ సౌందర్యాన్ని నిర్ణయిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ద్వారా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు జీవనోపాధికి దోహదపడుతుంది.

జనగామలో స్పిన్నింగ్ యూనిట్ ని పునఃప్రారంభించడానికి చేస్తున్న కృషికి అభినందనీయం. అనుభవజ్ఞుల ఆలోచనతో ధర్మేంద్ర, అతని బృందం చేస్తున్న శ్రమకు ప్రతిబింబమే నేడు మనం చూస్తున్న జనగామ స్పిన్నింగ్ యూనిట్. పనిని ఏదో ఒక ఉద్యోగంలా కాకుండా తమ సొంత పనిగా భావించి, యూనిట్ ని ఒక కుటుంబంగా తీర్చిదిద్ది పనిచేయడం హర్షించదగినది. ఇదేవిధంగా భవిష్యత్తులో స్థలకాలాలకు అనుగుణంగా పనిచేస్తూ మరింత మందికి జీవనోపాధిని కల్పిస్తూ చేనేత సమాజానికి ఆదర్శవంతంగా నిలవాలని ఆశిస్తున్నాను.
Mallikarjun
16 december 2025